APLatestNews.com top Banner

Social Media links
సత్కార్యాల పుణ్యఫలం రంజాన్ - ఆత్మీయత, అనుబంధాల భక్తి భావమే - ఇళ్ళలోనే రంజాన్ దీక్షలు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. రంజాన్ మాసం పవిత్రతకు ప్రతీక. ఆత్మీయతానుబంధాలతో ప్రతి ఇంట్లోనూ, భక్తిభావం కనిపించేలా ఉంటుంది. రంజాన్ మాసం ప్రారంభమై 25 రోజులు గడిచింది. శారీరక, ఆధ్యాత్మిక వికాసానికి సాధనమైన ఉపవాసాలు కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో ముస్లిము సోదరులు, ఎవరి ఇళ్ళలో వారు, రంజాన్ ఉపవాస దీక్షలు ఆచరిస్తున్నారు. మత పెద్దలు రంజాన్ నెల ప్రకటించినప్పటి నుంచి ముస్లిములు ఇఫ్తార్, సహర్ వేళల్ని పాటిస్తూ ఉపవాసాలు చేస్తున్నారు.

ప్రతి ఇంట్లోనూ భక్తిభావమే

రంజాన్ మాసం ముస్లింలకు, ఎంతో పవిత్రమైనది. ఇస్లాం మాసాల్లో తొమ్మిదో నెల అయిన రంజాన్ షాబాన్ నెల తర్వాత వస్తుంది. రంజాన్ మాసం నెలవంక చూశాక, వేకువజామున సహర్‌తో ఉపవాసాల్ని ప్రారంభిస్తారు.

ఈ నెల పాటు కఠిన ఉపవాస దీక్షలు అత్యంత భక్తి భావంతో పాటిస్తారు. రంజాన్ మాసం ముగిసే వరకు, పండుగ వాతావరణంలో దీక్షలు, పుణ్యకార్యాలు, ధార్మిక చింతన వెల్లివిరుస్తుంది.

ఉపవాసం పాటించేవారు తెల్లవారకముందే మేల్కొని భోజనం చేయాలి. దీన్నే సహర్ అంటారు. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు మంచినీళ్ళు ముట్టకూడదు. నోటిలోని లాలాజలం కూడా మింగకూడదు. సూర్యాస్తమయం కాగానే మసీదుల్లో ప్రార్ధనల అనంతరం, ఉపవాస దీక్ష విరమించి ఫలహారాలు, విందులు చేస్తారు. దీనినే ఇఫ్తార్ అంటారు.

ఉపవాస దీక్షలు పాటించే వారు, ప్రతిరోజూ అయిదుసార్లు నమాజ్ఞు ఆచరించాలి. లాక్‌డౌన్ నేపథ్యంలో ముస్లిం మతపెద్దలు, మౌజంలు మాత్రమే మసీదుల్లో ప్రార్ధనలు చేస్తున్నారు. మిగిలినవారు తమ ఇళ్ళలోనే నమాజు చేసుకుంటున్నారు.

రాత్రుళ్ళు 5వ నమాజు అయిన తర్వాత, ఖురాన్ చూసి సుమారు ముప్పావు గంట పాటు, ఇమాంలతో కలిసి ముస్లింలు తరావీహ్ నమాజ్‌ను ఆచరిస్తారు. ఈ తరావీహ్ నమాజులో, ముస్లిం మహిళలు పాల్గొనవచ్చు. తద్వారా రాత్రంతా అల్లా స్మరణతో ముస్లింలు గడుపుతారు.

అదుపులో ఆలోచనలు

రంజాన్ మాసంలో, ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ, అన్నపానీయాలకు దూరంగా ఉంటూ ఉపవాస దీక్ష పాటిస్తారు. ఆకలిదప్పులతో ఉండటమే కాకుండా అన్ని రకాల కోరికలను, వాంఛలను త్యజిస్తారు. చిత్తశుద్ధితో నిష్కల్మషంగా పాటించే వారికి, దైవ చింతన, జవాబుదారీతనం, సహనం, సద్గుణాలు అలవడతాయి. దీనిద్వారా ఏడాది పొడవునా ఈ సద్గుణాలు సొంతమవుతాయి.

రాగద్వేషాలకు దూరం

రంజాన్ సత్కార్యాల పుణ్యఫలం. ఆధ్యాత్మిక వికాసానికి స్వాగత ద్వారం. అన్ని దుష్టకార్యాల నుంచి రక్షణ పొందేందుకు, రంజాన్ శిక్షణగా భావిస్తారు. నెలపాటు పాటించే ఆచరణలు, మిగతా జీవితంలో తొణికిసలాడాలన్నదే, రంజాన్ ఉపవాసాల ధ్యేయం. ఉపవాసాలు పాటించే ముస్లింలు, రాగద్వేషాలను వీడి, పరిణితి కలిగిన వ్యక్తిగా, ప్రశాంత చిత్తంతో జీవితం గడుపుతారు.

వెల్లివిరిసే దయాగుణం

కొందరు మనుషుల్లోని ధనార్జన గుణాన్ని, రంజాన్ మాసం మార్చేస్తుంది. వారిలో దానగుణాన్ని పెంపొందిస్తుంది. ఈ మాసంలో దానధర్మాలు అధికంగా చేయాలని, మహమ్మద్ ప్రవక్త బోధించారు. ఈ నెలలో చేసే ఒక్కో పుణ్య కార్యాన్ని, అల్లాహ్ డెబ్భై రెట్లు అధికంగా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడని, ప్రవక్త బోధనల్లో తెలిపారు. తమ సంపదలో నుంచి, రెండున్నర శాతం ధనాన్ని పేదలకు పంచాలని, ఖురాన్‌లో ప్రధాన శాసనంగా సూచించారు.

దీంతో పేదలూ రంజాన్ మాసంలో, ఆనందంగా పండుగ జరుపుకుంటారు. సద్‌ఖా, జకాత్, ఫిత్రా వంటి దానాల వలన, పేదల అవసరాలు తీరుతాయి. ఫలితంగా సమ సమాజ స్థాపన జరుగుతుంది. ఇలాంటి దానాల విషయంలో తొలుత నిరుపేద బంధువులు, ఇరుగుపొరుగున ఉండే పేదలు, తర్వాత ఇతర పేదలు వంతున ప్రాధాన్యతా క్రమాన్ని పాటించాల్సి ఉంటుంది. సమాజంలో పేదరికానికి పరిష్కారంగా, జకాత్ ఉపయోగపడుతుంది.

ఆకలిదప్పుల బాధ తెలుస్తుంది

రంజాన్ మాసంలో పాటించే ఉపవాస దీక్ష, సమాజంలోని పేదల ఆకలిదప్పులను తెలుపుతుంది. తోటివారి వ్యధాభరిత జీవితాన్ని కళ్ళకు కడుతుంది. తోటివారు, అనాధలు, అణగారిన వారిపై ప్రేమ అలవడుతుంది. పరుల శ్రేయస్సు కాంక్షిస్తారు. వారి బాధల్ని, కష్టాల్ని తీర్చేందుకు పాటుపడతారు. ప్రతి ముస్లిం రంజాన్ మాసంలో, భక్తిశ్రద్ధలతో ముందుకు సాగుతుంటారు.  
Photo/ Video/ Text Credit : Koti Veeraiah Chintam, Vetapalem, AP
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 811 General Articles, 46 Tatvaalu
Dt : 24-May-2020, Upd Dt : 24-May-2020, Category : General
Views : 279 ( + More Social Media views ), Id : 559 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : ramadan , fruit of good works , intimacy , devotion , relations , home prayers fasting
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content