Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.
* ఏది పడితే అది తినదు. చాలా పద్దతి
* లాస్ వెగాస్, గ్రాండ్ కెనియన్ గ్లాస్, బర్గర్, పిజ్జా
* మా డాక్టర్లు బంగారం గా చూసుకుంటారు
* ప్రేమగా నిమిరే ఇంకో చెయ్యి, పలకరించే పలుకు
నా కూతురికి తగని సిగ్గు, ఒంటరిగా బయటకు వెళ్ళదు, నేను లేనిదే. ఎందుకు అంటే ముద్దు ముద్దుగా తడబడుతూ నడుస్తుంది. తల ఊపు(గు)తుంది, నవ్వుతూ, తూలి పడిపోతుంది, కాళ్లు నిలవవు కదా. చేతి కర్రతో పాటు , కొడుకు చెయ్యి కూడా కావాలి.
లోకములో అందరి పిల్లలు ఎదుగుతారు, కానీ చిత్రం నా కూతురు మాత్రం తరుగుతుంది. నన్ను వీడి వెళుతుంది ఏ క్షణమైనా, దివి లోని అత్తారింటికి లేదా ఆయన దగ్గరకు.
10 ఏళ్లుగా ఉన్న సెడాన్ కారు లో కూర్చోలేను అంటే , పెద్ద బండి(SUV) తీసా ఎత్తు గా ఉంటుంది అని. 5 ఏళ్ళు గా ప్రతి ప్రోగ్రాం కు, గుడి కి, ఊరికి చెయ్యి పట్టుకుని వస్తుంది. ఇంట్లో ఒక్కదానికీ తోచదు అని, నేను తీసుకెళతా. మైలు దూరము అయినా నడుస్తుంది అవి చూస్తూ.
నా కూతురు ఏది పడితే అది తినదు. చాలా పద్దతి గా డైట్ చేస్తుంది. ఎందుకంటే బిపీ , షుగరు, వర్టికో(తల తిరుగుడు) తోడుగా ఉండి ఉడికిస్తుంటాయి, ఉలికిస్తుంటాయి.
అక్కడ మా ఊళ్ళో ఖాళీ ఇంట్లో ఇంటర్నెట్ కెమెరా పెట్టాము, కూతురుకి వారానికి రెండు రోజులు, ఇల్లు, కొబ్బరి చెట్టు, జామ చెట్టు, పూల చెట్టు, గడ్డి, జనం ను చూపించాలి.
దొంగలు ఇల్లు తీసుకుని వెళ్ళలేదు అని. దొంగలు, తీవ్ర వాదులు బండి పెడితే, మా ఇరుగు పొరుగు కు క్షేమం కాదని కూడా.
నేను చెయ్యి పట్టుకుంటే చాలు ఎక్కడ కైనా వస్తుంది, ఏమైనా తింటుంది తెల్ల అన్నమే కావాలి అని మారాం చేయదు. లాస్ వెగాస్, గ్రాండ్ కెనియన్ గ్లాస్, మెక్సికో, హాలీవుడ్, . . . తిరిగేటప్పుడు బర్గర్, పిజ్జా, చలుపా, సబ్వే, ఏదైనా ఓకే. ఎన్ని డ్రెస్స్ లు వేయించి, ఎన్ని ప్రింట్ ఫోటోలు తీయించామో. గ్రాండ్ కెనియన్ గ్లాస్, నేను మిగతా వారు భయపడుతూ నడిస్తే, టక్కుమని తిరిగి వచ్చింది.
మీరు మీ పిల్లలకు (తయారు) చేసినట్టే , నేనూ నా కూతురి కి అన్నీ చేస్తా, బుద్దిగా చేయించుకుంటుంది. తలకు రంగు వేస్తా, కాలి, చేతి వేళ్ళ గోళ్ళు తీస్తా, జుట్టు దువ్వుతా , మంచం మీదవి ఎత్తి పోసి శుభ్రం చేస్తా, బూటు తొడుగుతా, రోజు మైలు చెయ్యి పట్టుకుని నడిపిస్తా, వారానికి మందులు 7 అరల డబ్బాలలో నింపుతా, కూరలు మరియు వాటికి కావాల్సినవి అన్ని కోసిస్తా, ఇల్లు వాకిలి చిమ్ముతా, . . . ఎవరి పిల్ల వారికి ముద్దు, బాధ్యత క్రుతజ్ఞత కదా మరి.
మంచము మీద పడుకోనే, రిమోట్ తో ట్యూబ్ లైట్, ఫాన్, లోన తిరగడానికి మెత్తటి చెప్పులు, బయట తిరగడానికి 2 రకాల బూట్లు చెప్పులు, మడిచి సంచిలో పెట్టుకునే కర్ర, లేడీస్ బాగ్, . . .
రెండు సార్లు కింద పడి , ఎమర్జెన్సీ కి వెళ్ళి వచ్చింది. వద్దన్నా ఏదో ఒక పని చేస్తూ, బొంగరము లాగా తిరుగుతుంది. అపార్ట్మెంట్ లు చిన్నవి కాబట్టి, పడిపోకుండా పట్టుకోవటానికి గోడలు దగ్గర గా ఉంటాయి. వద్దు అన్నా గుడ్డలు ఉతికి ఆరవేస్తుంది, అపార్ట్మెంట్ ఓనరు చెప్పి, చెప్పడం మానేసారు. చిమ్మి కళ్ళాపితో, ముగ్గులు వేస్తుంది.
పక్క ఢిల్లీ హిందీ అమ్మాయి , నా కూతురు జడ చూసి ఈర్ష పడింది. ఆంటీ నాకు మూర జడ ఉంటే , మీకు ఇంకా అంత జడా అని. మా ప్రభుత్వ ము , పోలీసులు, డాక్టర్లు నా కూతురు ని బంగారం గా చూసుకుంటారు, గౌరవిస్తారు. విమానం వాళ్ళు కూడానండోయ్, 4 సార్లు భారతం 24 గంటలు ప్రయాణం చేసింది కూడా.
డాక్టరు, 2014 లోనే ఇక కష్టం అన్నారు, షుగర్ బీపీ విపరీతమైన స్థాయి చూసి. అయినా కూడా వేపాకు, కాకర , అల్లం, వెల్లుల్లి, ఆకు రసాలతో, . . ., బీపీ షుగర్ అర బిళ్ల ల కు తగ్గించుకుంది. వేసుకోను అని మారాం చేస్తే, కూతుళ్ళ దగ్గర వదులు తా అంటే చాలు. బుద్ది గా అన్ని వేసుకుంటుంది. రోజూ నట్సు పండ్లూ తప్పనిసరి. గుడి ప్రసాదాలు ఆపలేను చక్కెర ఉన్నా.
నా కూతురు ని, తన కూతుళ్లు వద్దు అన్నా కూడా, అయ్యో రేపు వాళ్ళ భవిష్యత్తు ఏమిటో వాళ్ళ మూర్ఖత్వముతో అని బాధపడుద్ది , పిచ్చి పిల్ల.
రోజూ ఉదయం 5 కల్ల లెగుస్తుంది, అన్నీ తను చూసుకుంటుంది. రోజూ అరగంట పూజ, కరమాల తప్పనిసరి ఉదయం 8 am లోపు. 5 ఏళ్ళు గా శని వారం, తలస్నానముతో శని, శివయ్య ల కు నేతి దీపం పెడుతుంది, ఉదయం 8 లోపు 6 మైళ్ళ దూరం గుడిలో. 9 సార్లు నవగ్రహాలు చుట్టూ తిరుగుతుంది. రామకోటి 5 లక్షలు రాసింది.
రాత్రి పూట గురక వినకపడకపోతే, దగ్గరలో కింద పడుకునే నాకు, గుండె గుభేలు మంటుంది. వెంటనే, బుజ్జీ సౌండ్ పెంచు , నిద్ర రాకపోతే, జోకొడతా అంటా, అంతే మరలా గురక వినపడుతుంది.
మధ్యాహ్నం యప్టీవీ జెమినీలో 3 సీరియల్స్ తనే చూసుకుంటుంది. డేట్, చాన్నెల్, టైం ను బట్టి సీరియలు తనే సెలెక్ట్ చేసుకుంటుంది. సీరియల్ వారి మాటలకు ఆవేశముతో ఊగిపొతుంది, శాంత పరుస్తా, అది నటన నిజం కాదు అని. ప్రకటనలు ఫార్వర్డ్ చేసుకుంటుంది, కాచప్ టీవీలో, అందులో వారం ప్రోగ్రాం లు నిల్వ ఉంటాయి. వాట్సాప్ లో, ఇంటికి ఎవరన్నా వస్తే ఫొటోలు పంపుతుంది.
పడుకునే ముందు, పాత సినిమా చూపించి, ఆ మాటలు అర్ధము అయ్యేట్లు చెప్పాలి. లేకపొతే రామారావు, నాగేశ్వరరావు, సూర్యకాంతమ్మ అన్నది అర్ధము గాక అలిగి, టీవీ వద్దు అని అటు తిరిగి పడుకుంటుంది.
అమ్మో అలిగి కూర్చుంది అంటే చాలా కష్టము. చాలా బతిమిలాడాలి. కాళ్ళు పడుతూ, బ్రహ్మ కడిగిన పాడము, నానని తన్నిన పాదము అంటే చాలు, కిల కిలా నవ్వుద్ది.
కూరలన్నీ కోసిస్తే మంచిగా కూర చేస్తుంది. ఉప్పు కారం చాలా పొదుపు. బయట తిండి కావాలని మారాము చేయదు. మాసం కు మరీ దూరం.
లక్షలు ఇస్తా , ఊళ్ళో ఉంటావా అంటే , ఆస్తులు నాకెందుకు, లక్షణమైన చేయి కావాలంటుంది. పొట్ట మీద జోకొడుతూ , కాళ్ళు వత్తుతూ ఉంటే, గుర్రు పెట్టి పసిపాపలా నిద్ర పోతుంది. పైన దేవుడు, కింది జీవుడు ఉండగా నాకేమి దిగులు అని, హయిగా కలతలేని నిద్ర 5 ఏళ్ళ పాప లాగ.
టైం కి వెళ్ళలేక పోతున్నాను అని, వాళ్ళని ఇబ్బంది పెట్టలేక, అమెరికా ప్రభుత్వ ఉద్యోగం మానేసా. ఎన్నిరోజులు ఉంటుదో తెలీదు అని, కొంతకాలము అయినా తోడు ఉండాలి అని.
మరి నా కూతురు వయసు తెలుసా? షుమారు 74 ఏళ్ళు ఉన్న అమ్మ. అలాగే, మీకు కూడా వయస్సు కు(60 ఏళ్ళు లేదా జబ్బున పడిన వారు) వచ్చిన పిల్లలు ఉండే ఉంటారు. ఇంతకన్నా ఎక్కువే మీరూ చేసి ఉంటారు, ఊళ్ళు తిప్పి ఉంటారు.
పెద్దలు మనల్ని పసి పాపలు గా సాకి ఇంత చేస్తే, మరి మనమూ వాళ్ళను పిల్లలుగా జాగ్రత్త గా చూసుకోవాలి కదా. లేకపోతే, దేవుడు క్షమించడు, రేపు మన బతుకు అంతే కదా.
5 ఏళ్ల లోపు పిల్లల కు , 60 ఏళ్ల పిల్లల(పెద్దలు) కు కావాలసింది మనము దూరంగా ఉండి విసిరే డబ్బు కాదు, ప్రేమగా చేయిపట్టుకుని నిమిరే ఇంకో చెయ్యి, ప్రేమతో పలకరించే పలుకు. మనమూ ఆ స్తితికి వెళ్ళడానికి ఎంతో దూరము లేదు మిత్రమా. ప్రతి ఒక్కరికి తప్పదు, కొంచెము ముందూ వెనుక అంతే.
- కన్న తల్లిని, కూతురులా చూసుకునే, ఓ పిచ్చి కొడుకు
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 951 General Articles, 46 Tatvaalu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments